Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

రూతు 1వ అధ్యాయము

Rth 1:1  న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను. 
Rth 1:2  ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. 
Rth 1:3  నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి. 
Rth 1:4  వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదానిపేరు ఓర్పా రెండవదానిపేరు రూతు. 
Rth 1:5  వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను. 
Rth 1:6  వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. 
Rth 1:7  అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లు చుండగా 
Rth 1:8  నయోమి తన యిద్దరు కోడండ్రను చూచిమీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక; 
Rth 1:9  మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందు నట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. 
Rth 1:10  అంతట వారు ఎలుగెత్తి యేడ్చినీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా 
Rth 1:11  నయోమినా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా? 
Rth 1:12  నా కుమార్తె లారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను 
Rth 1:13  వారు పెద్ద వారగువరకు వారి కొర కు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. 
Rth 1:14  వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పాతన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా 
Rth 1:15  ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయి నదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను. 
Rth 1:16  అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; 
Rth 1:17  నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. 
Rth 1:18  తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి. 
Rth 1:19  వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా 
Rth 1:20  ఆమెసర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి1 అనక మారా2 అనుడి. 
Rth 1:21  నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. 
Rth 1:22  అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి. 

రూతు 2వ అధ్యాయము

Rth 2:1  నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు. 
Rth 2:2  మోయాబీయురాలైన రూతునీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమెనా కూమారీ పొమ్మనెను. 
Rth 2:3  కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది. 
Rth 2:4  బోయజు బేత్లెహేమునుండి వచ్చియెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారుయెహోవా నిన్ను ఆశీర్వ దించును గాకనిరి. 
Rth 2:5  అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచిఈ చిన్నది ఎవరిదని అడుగగా 
Rth 2:6  కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడుఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు. 
Rth 2:7  ఆమెనేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను. 
Rth 2:8  అప్పుడు బోయజు రూతుతోనా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. 
Rth 2:9  వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. 
Rth 2:10  అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొనిఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజునీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 
Rth 2:11  నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. 
Rth 2:12  యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను. 
Rth 2:13  అందుకు ఆమెనా యేలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమగలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. 
Rth 2:14  బోయజుభోజనకాలమున నీ విక్కడికి వచ్చిభోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను. 
Rth 2:15  ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజుఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి 
Rth 2:16  మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞా పించెను. 
Rth 2:17  కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను. 
Rth 2:18  ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను. 
Rth 2:19  అంతట ఆమె అత్త ఆమెతో­నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పిఎవని యుద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను. 
Rth 2:20  నయోమిబ్రదికియున్న వారికిని చచ్చినవారికిని ఉప కారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమిఆ మనుష్యుడు మనకు సమీపబంధు వుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా 
Rth 2:21  మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పని వారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. 
Rth 2:22  అప్పుడు నయోమి తన కోడలైన రూతుతోనా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. 
Rth 2:23  కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివ సించెను. 

రూతు 3వ అధ్యాయము

Rth 3:1  ఆమె అత్తయైన నయోమినా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. 
Rth 3:2  ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు. 
Rth 3:3  నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము. 
Rth 3:4  అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా 
Rth 3:5  ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి 
Rth 3:6  ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. 
Rth 3:7  బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను. 
Rth 3:8  మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను. 
Rth 3:9  అతడునీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా 
Rth 3:10  అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది. 
Rth 3:11  కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు. 
Rth 3:12  నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు. 
Rth 3:13  ఈరాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొను మని చెప్పెను. 
Rth 3:14  కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడుఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను. 
Rth 3:15  మరియు అతడునీవు వేసి కొనిన దుప్పటి తెచ్చి పట్టు కొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరుకొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను. 
Rth 3:16  ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్తనా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసిన దంతయు తెలియజేసి 
Rth 3:17  నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చె ననెను. 
Rth 3:18  అప్పుడు ఆమెనా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊర కుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండుమనెను. 

రూతు 4వ అధ్యాయము

Rth 4:1  బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజుఓయి, యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. 
Rth 4:2  బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడనిచెప్పగా వారును కూర్చుండిరి. 
Rth 4:3  అతడుమోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను. 
Rth 4:4  ఈ పుర నివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమ నగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడి పింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడునేను విడిపించెద ననెను. 
Rth 4:5  బోయజునీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా 
Rth 4:6  ఆ బంధు వుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టు కొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. 
Rth 4:7  ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని, క్రయవిక్రయములను గూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. 
Rth 4:8  ఆ బంధువుడునీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా 
Rth 4:9  బోయజుఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు. 
Rth 4:10  మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజ లందరితోను చెప్పెను. 
Rth 4:11  అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక; 
Rth 4:12  ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి. 
Rth 4:13  కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను. 
Rth 4:14  అప్పుడు స్త్రీలుఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. 
Rth 4:15  నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. 
Rth 4:16  అప్పుడు నయోమిఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. 
Rth 4:17  ఆమె పొరుగు స్త్రీలునయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి. 
Rth 4:18  పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను, 
Rth 4:19  హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, 
Rth 4:20  నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను, 
Rth 4:21  బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, 
Rth 4:22  యెష్షయి దావీదును కనెను.